హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు తమకు న్యాయంగా దక్కాల్సిన స్టైపెండ్‌ను చెల్లించాలని సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. తమ సేవలకు సరైన ఆర్థిక సాయం అందడం లేదని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటర్న్లు, పీజీ మెడికల్ విద్యార్థులు వాపోతున్నారు.
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి నెలా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులకు చెల్లిస్తున్నట్టుగానే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న యూజీ (ఇంటర్న్‌షిప్ చేస్తున్న) విద్యార్థులకు రూ.25,906, పీజీ వైద్య విద్యార్థులకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు స్టైపెండ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఏడాదికి కొంత చొప్పున విద్యార్థుల నుంచే స్టైపెండ్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి.
ఆ డబ్బులనే ప్రతి నెలా విద్యార్థులకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో తమకు న్యాయంగా దక్కాల్సిన స్టైపెండ్‌ను ఎందుకు ఇవ్వడం లేదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగితున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టైపెండ్ అడుగుతున్న విద్యార్థులను యాజమాన్యాలు టార్గెట్ చేస్తున్నాయని, ఏడాదిలో పూర్తికావాల్సిన ఇంటర్న్‌షిప్‌ను ఉద్దేశపూర్వకంగా మరో 2-3 నెలలు పొడిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము అనుకున్న సమయానికి ఇంటర్న్‌షిప్ పూర్తికాదని, అదే జరిగితే నీట్ పీజీకి అర్హత కోల్పోతామని వాపోతున్నారు.
వైద్య విద్యార్థులకు అందుతున్న స్టైపెండ్ వివరాలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పటికప్పుడు ఆధారాలతో సమర్పించాలని ఎన్ఎంసీ కోరుతున్నది. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, పీజీ కోర్సు ప్రారంభం కాగానే బ్లాంక్ చెక్కులపై సంతకాలు తీసుకుంటున్నాయి. విద్యార్థుల అకౌంట్లో స్టైపెండ్ పడగానే బ్లాంక్ చెక్కుల ద్వారా ఆ డబ్బులను తమ ఖాతాలోకి మళ్లించుకుంటున్నాయి. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో తమకు కనీస మౌలిక సదుపాయాలతోపాటు అధ్యాపకులు కూడా లేరని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వైద్యవిద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ తరచుగా ఆదేశిస్తున్నప్పటికీ ప్రైవేటు కాలేజీలు లెక్కచేయడం లేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ఇప్పటికే పలుమార్లు డీఎంఈ, అకడమిక్ డీఎంఈ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దృష్టికి తీసుకెళ్లడంతోపాటు తమకు ైస్టెపెండ్ అందడం లేదని ఈ-మెయిళ్ల ద్వారా ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు.