హైదరాబాద్, మే 19 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సహకార నూనెగింజల రైతుల సమాఖ్య లిమిటెడ్(టీజీ ఆయిల్‌ఫెడ్) పారదర్శకంగా రైతులకు న్యాయమైన ధరను అందిస్తున్నదని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కొందరు ప్రైవేట్ కంపెనీలకు లాభాలు తగ్గడంతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అప్పారావుపేట, అశ్వారావుపేట ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతూనే కొత్తగా సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రైవేటు కంపెనీలు ఇప్పటి వరకు తెలంగాణలో కొత్త ప్లాంట్లను స్థాపించలేదని వెల్లడించారు. 2018-19లో ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో 7,069 మంది రైతులు 34,720 ఎకరాలు సాగు చేశారని, ప్రస్తుతం 8 జిల్లాల్లో 36,050 మంది రైతులు 1,44,396 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు రైతులకు తక్కువ ఎఫ్‌ఎఫ్‌బీ ధర చెల్లించేందుకు ఆయిల్‌ఫెడ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు.