సమయం చూసి బాదుడహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పండుగలు రాగానే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా రాఖీ పండుగ వేళ మరోసారి సిండికేట్గా ఏర్పడి చార్జీలను ఏకంగా మూడింతలు పెంచేశారు. తద్వారా హైదరాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాలతోపాటు ఏపీలో దూరప్రాంతాలకు వెళ్లేవారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. రి
రిటర్న్ జర్నీలోనూ అదే చార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజూ దాదాపు 1,000 బస్సులను నడిపే ప్రైవేట్ ఆపరేటర్లు.. ఇప్పుడు రద్దీని సొమ్ము చేసుకునేందుకు 2 వేలకుపైగా బస్సులను తిప్పినట్టు తెలిసింది. వారికి దీటుగా తెలంగాణ ఆర్టీసీ కూడా ‘స్పెషల్’ బస్సులను నడుపుతున్నది. తద్వారా దూరాన్ని బట్టి 50 నుంచి 100 శాతం అధిక చార్జీలు వసూలు చేస్తున్నది.
అధిక వసూళ్లపై చర్యలేవి?
అధిక చార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లపై మోటరు వాహనాల చట్టం-1988 కింద చర్యలు చేపట్టే అధికారం రవాణా శాఖ అధికారులకు ఉన్నది. కానీ, ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టిన దాఖలాలు లేవు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడిచిన 317 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాడు హెచ్చరించారు. కానీ, అది అప్పటికే పరిమితమవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ మళ్లీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నది.