గద్వాల అర్బన్, నవంబర్ 13 : రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు గురువారం ఫాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్ర మాయమాటలు చెప్పి సంవత్సరం పాటు ఇంట్లో పెట్టుకుని వేధింపులకు గురిచేశాడు. సదరు వ్యక్తి వేధింపుల నుంచి తప్పించుకున్న బాలిక తండ్రికి విషయం వివరించింది. దీంతో 2017లో పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశారు.
గురువారం ఇరువర్గాల వాదన అనంతరం నిందితుడికి 35 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ.. బాలిక కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందించాలని జడ్జి తీర్పును వెల్లడించారు. వడ్డేపల్లి మండలం కేంద్రానికి చెందిన ఓ బాలికను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన వడ్డే వెంకటరమణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడు. బాలిక తల్లి 2024లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.