భువనగిరి కలెక్టరేట్, జూలై 29: వృత్తిదారుల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఉమ్మడి పాలకులు గీత వృత్తిపై కక్షతో కార్మికులపై కాఠిన్యంగా వ్యవహరించి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మూసివేశారని విమర్శించారు. స్వరాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంచేశారు.
రాష్ట్రంలోనే తొలిసారి యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో రూ.8 కోట్లతో చేపడుతున్న నీరా ఉత్పత్తి కేంద్రం పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న గౌడ జాతిని కుంగదీయాలనే దురాలోచనతో సీమాంధ్ర పాలకులు నాడు హైదరాబాద్‌లో కల్లు డిపోలను మూసివేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో నేడు గౌడ జాతి ప్రాణం పోసుకున్నదని, కార్యదక్షుడైన సీఎం కేసీఆర్ పాలనలో గీత కార్మికుల బతుకుల్లో వెలుగులు ప్రసరించాయని స్పష్టంచేశారు. గీత వృత్తి రక్షణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం చెట్టు పన్నును పూర్తిగా రద్దు చేసిందని తెలిపారు. ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా, పింఛన్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
నీరా కేంద్రం నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గీత కార్మికులకు మరింత ఉపాధి కల్గించేలా జిల్లాలో నాలుగు నీరా సేకరణ కేంద్రాలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రకృతి వరప్రసాదమైన కల్లు, నీరాలలో కల్తీలకు ఆస్కారం ఉండదని స్పష్టంచేశారు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరాను ఎవరైనా సేవించవచ్చని తెలిపారు. ఆగస్టు 12న గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, గౌడసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.