హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : పురాతన భారతీయ సిద్ధాంతాలైన అతిథి దేవోభవను మనం పూర్తిగా విస్మరించామని, వసుధైక కుటుంబమనే భావనను వదిలేశామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయామని, ఇంటికి అతిథి వస్తే ఎప్పుడెల్లిపోతారా? అని వేచిచూసే రోజుల్లో మనమున్నామని, ఇలాంటి మనస్తత్వం నుంచి అంతా బయటపడాలని ఆయన కోరారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఏఎస్ఐఎస్సీ) తెలంగాణ, ఏపీ రాష్ర్టాల వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. గొప్ప వారసత్వ సంపదకు మనమంతా వారసులమని, మన భవిష్యత్తు తరాలు మనం గర్వించే సంప్రదాయాలను తిరిగి ఆకలింపు చేసుకొంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అందరితో కలుపుగోలుతనం, పరిశుభ్రత, ఆవిష్కరణలను సమ్మిళితం చేసి భారతీయతత్వంతో క్రమంగా పురోగమిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని ఉన్నతమైన జీవన ప్రమాణాలను తర్వాతి తరాలకు అందించాలని సూచించారు. సమావేశంలో తెలుగు రాష్ర్టాల నుంచి పలు ఐసీఎస్ఈ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు పాల్గొన్నారు.