Teachers | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలో డిసెంబర్లో 4న సర్వే జరగనుంది. ఇందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతున్నది. విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చేలా బోధన, నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నది. కానీ ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను తెరపైకి తీసుకొచ్చింది. సర్వే కోసం 3 వారాల పాటు ప్రాథమిక పాఠశాలలను ఒక్క పూట నిర్వహించాలని నిర్ణయించింది. ఓ వైపు న్యాస్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ కుల గణన సర్వేకు సమయం కేటాయిస్తే జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యా ప్రమాణాలు దారుణమైన స్థాయిలో పడిపోతాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మూడేండ్ల్లకోసారి కేంద్ర ప్రభుత్వం న్యాస్ పరీక్ష నిర్వహిస్తుంది.2021లో నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో తెలంగాణ అట్టడుగున నిలిచింది. కరోనా ప్రభావంతో విద్యాప్రమాణాలు దెబ్బతినడం వల్ల విద్యార్థులు ప్రతిభ కనబర్చలేకపోయారు. మళ్లీ ఇప్పుడు డిసెంబర్ 4న న్యాస్ పరీక్ష జరగనున్నది. ఈ సారి 3, 6, 9 తరగతుల విద్యార్థులకు సర్వే నిర్వహించనున్నది. విద్యాశాఖ అధికారులు ప్రాక్టీస్ పేపర్లు, మాడల్ పేపర్లు తయారు చేసి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మెరుగైన ర్యాంక్‌ను సాధించవచ్చని ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలోనే కుల గణన విధులు వచ్చిపడ్డాయి. మూడు వారాల పాటు ప్రాథమిక బడులు ఒక్క పూటనే నడవనున్నాయి. టీచర్లంతా సర్వేలో నిమగ్నమై ఉండటంతో చదువులు ముందుకు సాగే పరిస్థితుల్లేవు. అంతిమంగా డిసెంబర్లో నిర్వహించే న్యాస్ పరీక్షపై ఈ ప్రభావం పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్లోలు పెడుతున్నాయి.
కుల గణన సర్వేకు ప్రైవేటు టీచర్లను ఎందుకు వినియోగించడంలేదు? కేవలం ప్రైమరీ టీచర్లకు విధులు కేటాయించడం సరికాదు. ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో వెల్లడించిన అభిప్రాయాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మధ్యాహ్నం తర్వాత సర్వేచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉదయం పూట సర్వేను నిర్వహించేలా ఆదేశాలివ్వాలి.
కుల గణన విధుల కేటాయింపులో వివక్ష చూపొద్దు. బోధనకు ఆటంకం కలగకుండా చూడాలి. ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని అంటూనే, మరోవైపు స్కూళ్లను ఒక పూట మూసివేయడం ఎంతవరకు సమంజసం? బదిలీలు, పదోన్నతులు పూర్తయి చదువులు గాడిన పడుతున్న తరుణంలో పీఎస్‌లను మూడు వారాలపాటు ఒకే పూట నడపడంతో విద్యార్థులు నష్టపోతారు.