బాసర, మే 16: బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి జరిగినట్టు తేలింది. దాడి ఘటన సీసీ టీవీ పుటేజీతో ఆ విషయం బయటపడింది. పూజారిపై నూకం రామారావు దాడికి దిగిన వీడియో పుటేజీ స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఈ విషయంతో దాడి చేయలేదంటూ నూకం రామారావు బుకాయించాడని తేలిపోయింది. వాస్తవంగా తనపై బుధవారం సాయంత్రం స్థానిక వేద భారతీపీఠం నిర్వాహకుడు వేద విద్యానందగిరి (ఆంధ్ర స్వాములోరి) ప్రధాన అనుచరుడైన నూకం రామారావు తనపై దాడి చేసినట్టు పూజారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
దీనిపై నూకం రామారావు శుక్రవారం బాసరలో మీడియాతో మాట్లాడారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను దాడి చేయలేదంటూ బుకాయించాడు. ఆలయ ప్రధాన అర్చకుడిపై చేయి ఎత్తలేదని, వేద మంత్రాలు పలికే నోటితో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. పూజారితో కేవలం మాటల యుద్ధమే జరిగిందని, ఆ సమయంలో తాను స్కూటర్ కూడా దిగలేదని, సీసీ టీవీ పుటేజీని సైతం మీడియాకు అందజేశారు. అయితే అది పూర్తి వీడియో కాకుండా వీడియోలో కొంతభాగానే మీడియాకు అందజేశారు.
బాసరకు చెందిన స్థానికులు సీసీ టీవీ పుటేజీ పూర్తి వీడియోను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ చేశారు. ఈ వీడియోలో నూకం రామారావు స్కూటీ దిగి వెళ్లి పూజారిపై దాడి చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ స్వామీజీ ప్రధాన అనుచరుడు రామారావు చెప్పింది మొత్తం కట్టుకథే అని తేలింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసింది కాకుండా చేయలేదంటూ అబద్ధాలు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పూర్తి సీసీ టీవీ పుటేజీ విడుదల చేయకుండా బుకాయించి, బురిడీ కొట్టించే ప్రయత్నం చేయడంపై మండిపడుతున్నారు.