గద్వాల/రేవల్లి, నవంబర్ 29 : వలసలను నివారించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కరువై ప్రజలు దూర ప్రాంతాలకు వలస వెళ్లారని, తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయంతోపాటు కుల వృత్తులకు పూర్వవైభవం కల్పించడం, ఇతర రంగాలు అభివృద్ధి చెందడంతో వలసవాదులు సొంతూళ్లకు తిరిగి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ సరితతో కలిసి మంత్రి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
రాత్రి వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూర్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఆయా చోట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా ఆరాట పడుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం తమదేనని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.