హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): డెకన్ క్రానికల్ దినపత్రికకు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి మీడియా కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీరాం కర్రి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కొణతం దిలీప్ తెలిపారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తాను చేసిన ఫిర్యాదుపై ఎట్టకేలకు జవాబు వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. దీనికి కేస్ నంబర్ 656/2024/ఏ-పీసీఐ ఇచ్చి, మరికొంత సమాచారం పంపించాలని తనకు లేఖ రాసిందని తెలిపారు. వారు అడిగిన సమాచారం ఒకటి రెండు రోజుల్లో పంపిస్తానని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఓ వైపు డెకన్ క్రానికల్ దినపత్రికకు శ్రీరాం కర్రి రెసిడెంట్ ఎడిటర్‌గా ఉంటూనే, మరోవైపు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి మీడియా సలహాదారుగా పది నెలలపాటు అనధికారికంగా వ్యవహరించారు. 2024 జనవరిలో దావోస్, ఆ తరువాత లండన్, అమెరికా వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందంతో ఆయన వెళ్లడం పత్రికా విలువలకు, మీడియా నిష్పాక్షికతకు పాతర వేసే చర్య’ అని పేర్కొంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్టు దిలీప్ తెలిపారు. ఆ ఫిర్యాదు చేశాక శ్రీరాం కర్రి.. 2024 ఆగస్టులో డెకన్ క్రానికల్ పత్రికలో రెసిడెంట్ ఎడిటర్ పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు.