హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొడంగల్‌లోని లగచర్ల ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న రాత్రి గ్రామంలోకి వెళ్లిన పోలీసులు లంబాడా బిడ్డలతో దుర్మార్గంగా వ్యవహరించారని స్థానికులు చెప్తున్నారని తెలిపారు. మహిళలతో చాలా నీచంగా వ్యవహరించారని, యువతులు, మహిళలు, వృద్ధుల శరీరభాగాలను తడిమారాని, ఆ ఆడబిడ్డలు చెప్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నారు. అర్ధరాత్రి గ్రామంలోకి వెళ్లి గిరిజన మహిళలతో దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హకుల కమిషన్ స్పందించాలని కోరారు. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.