రవీంద్రభారతి, జనవరి1: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్ తొలిసారిగా ‘బహుజనబంధు’ పురస్కారాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి అందజేశారు. బహుజన కళా మహోత్సవాలు-2023 పేరిట సాంస్కృతిక కళా ప్రదర్శనలను ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతికశాఖ చైర్మన్ రసమయి బాలకిషన్, తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. ఈ పురస్కారం లభించడం తన జీవితంలో మధుర ఘట్టమని, బహుజనుల కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. రసమయి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బహుజన కళారూపాలు ప్రముఖపాత్ర పోషించాయని చెప్పా రు.
జూలైలో అమెరికాలో నిర్వహించనున్న తానా మహాసభల్లో బహుజన కళారూపాలను సముచితంగా గౌరవిస్తామని అంజయ్యచౌదరి తెలిపారు. నిక్షిప్తంగా ఉన్న మరిన్ని కళారూపాలను ప్రపంచ వేదిక మీద పరిచయం చేస్తామని డాక్టర్ తోటకూర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న కిన్నెరమెట్ల మొగిలయ్య, చింతకింది మల్లేశం, ఆచార్య కొలకనూరి ఇనాక్, ఎడ్ల గోపాలరావు, డాక్టర్ సూర్యారావు, డాక్టర్ సాయిబాబాగౌడ్, దళవాయి చలపతిరావును సన్మానించారు. బహుజన శతకం రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆలపించిన పద్యాలు ఆకర్షణగా నిలిచాయి.