Metpally | మెట్పల్లి, ఫిబ్రవరి 10: తన వద్ద కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడంతో ఆ గురువు ఆనందంలో మునిగితేలారు. ఇచ్చిన మాట ప్రకారం వెండి బ్రాస్లెట్లను బహూకరించి ఔదార్యాన్ని చాటారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గంగాధర్.
నిరుడు పట్టణంతోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన పలువురు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఎస్సై ఉద్యోగానికి ఎంపికైతే బంగారు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైతే వెండి బ్రాస్లెట్లు అందజేస్తానని గంగాధర్ మాట ఇచ్చారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన ఎనిమిది మందికి శనివారం మెట్పల్లిలో వెండి బ్రాస్లెట్లను బహూకరించారు.