హైదరాబాద్, మే 24 (నమస్తేతెలంగాణ) : మలేషియాలోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 6న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ మలేషియా విభాగం, మలేషియా తెలంగాణ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం మలేషియా చేరుకున్నారు. వేడుకలు జరుగనున్న కన్వెన్షన్ సెంటర్ను ఆయన సందర్శించారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. పార్కింగ్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం నిర్వాహక కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. వేడుకల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భారతదేశం వెలుపల 2025లో డాలస్లో నిర్వహించిన వేడుకల తర్వాత మలేషియాలో నిర్వహించడం రెండోసారి అని వెల్లడించారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా విభాగం, మైటా ముఖ్య ప్రతినిధులు టీ మారుతి కూర్మ, తిరుపతి, సందీప్గౌడ్, నరేందర్రెడ్డి, అనిల్, జ్యోతి, మోనా, పూర్ణచందర్రావు, దీపిక తదితరులు పాల్గొన్నారు.