Telangana | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటినుంచి వరుసగా బయటి రాష్ర్టాలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేన్స్ సెమికాన్ వంటి ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణ నుంచి తరలి వెళ్లగా, తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ సైతం ఏపీకి బయల్దేరింది. దీనివల్ల రాష్ర్టానికి రావాల్సిన రూ.1700 కోట్ల పెట్టుబడితోపాటు 2000 ఉద్యోగాలు నష్టపోయినట్టు చెప్పవచ్చు.
బీఆర్ఎస్ హయాంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ మహేశ్వరంలోని ఈ-సిటీలో రూ.483 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటుచేసింది. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు జూలై 2021లో దీన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సెల్స్, 4 గిగావాట్ల మాడ్యూల్స్ తయారుచేసే ఫొటో వోల్టాయిక్(పీవీ) సంస్థను ఏర్పాటుచేయనున్నట్టు ఆ సంస్థ గత ఏడాది ప్రకటించింది. అనుమతుల కోసం పరిశ్రమల శాఖకు దరఖాస్తు కూడా చేసుకున్నది. ఇంతలోనే ఏమైందో ఏమో ఇప్పుడు ఏపీలో రూ.1700కోట్లు పెట్టుబడి పెడుతున్నామని, దీంతో 2000మందికి ఉద్యోగాలు లభిస్తాయని తాజాగా స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
తమ వ్యాపార వ్యూహంలో భాగంగా తెలంగాణలో ప్రతిపాదిత పెట్టుబడిని ఏపీకి మార్చుకున్నట్టు బాంబే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు వివరించింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 269.71ఎకరాల భూమిని ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు కేటాయించింది. ఈ సైట్లో 4గిగావాట్ల సోలార్ సెల్ టాప్కాన్, 5గిగావాట్ల సిలికాన్ ఇంగోట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తరువాత సంస్థ తమ పెట్టుబడి వ్యూహాన్ని మార్చుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏపీకి తరలివెళ్లడం తెలంగాణకు గట్టి ఎదురుదెబ్బగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ తమిళనాడుకు వెళ్లగా, కేన్స్ సెమికాన్ గుజరాత్‌కు మారింది. ఇలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ర్టాన్ని వీడటం పరిశ్రమ వర్గాల్లో ప్రభుత్వంపట్ల తగ్గుతున్న విశ్వాసానికి సంకేతంగా వారు చెప్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిన పెట్టుబడి అనుకూల పర్యావరణ వ్యవస్థను కొనసాగించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పారిశ్రామికరంగం మరింత క్షీణించే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన పారిశ్రామిక అనుకూల, స్నేహపూర్వక విధానాలతోనే తాము తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ప్రతినిధులు ఈ-సిటీలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా వెల్లడించడం గమనార్హం. కాగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా టెస్లా కంపెనీని కూడా తమ రాష్ర్టానికి ఆహ్వానించేందుకు తెరవెనుక కసరత్తు చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీన్నిబట్టి ప్రీమియర్ ఎనర్జీస్ బాటలోనే మరికొన్ని కంపెనీలు తరలిపోయే అవకాశం లేకపోలేదని అంటున్నాయి.