సోమవారం 25 మే 2020
Telangana - Apr 08, 2020 , 01:23:05

పిండానికీ కరోనా సోకేనా?

పిండానికీ కరోనా సోకేనా?

  • అమెరికా లూసియానాలో గర్భిణికి కొవిడ్‌-19..
  • నెలలు నిండక ముందే ప్రసవం.. గంటలోనే కన్నుమూసిన పసిగుడ్డు
  • దీని గుట్టు విప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా మొదలైన పరిశోధనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి ఆడుతున్న క్రీడలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషాదకర సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకొన్న విషాదం వెనుక దాగున్న మర్మాలపై వైద్యులు, శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. లూసియానా రాష్ట్రంలో వారంక్రితం నెలలు నిండని (22 వారాల) గర్భిణి అరోగ్య సమస్యలతో స్థానిక దవాఖానలో చేరింది. శ్వాసకోశ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్టు చికిత్స చేసిన వైద్యుడు క్లార్క్‌ గుర్తించారు. ఆమె రక్తంలో ఆక్సీజన్‌ పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్టు తేల్చి కరోనా పరీక్ష జరుపగా పాజిటివ్‌గా వచ్చింది. సోమవారం పాపకు జన్మనిచ్చింది. ఆ పాప కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. పాప బతికే అవకాశాలు ఆరు శాతమే అని వైద్యుడు క్లార్స్‌ చెప్పినట్టే జరుగడంతో.. నెలలు నిండని కారణంగానే పసిగుడ్డు కన్నుమూసిందనే అభిప్రాయానికి వచ్చేవారు. అయితే కరోనా మహమ్మారి తల్లి గర్భంలోని పసిగుడ్డును కూడా కాటేసిందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా తయారైంది. దీనికి సంబంధించి పరీక్షలు చేస్తున్నట్టు డాక్టర్‌ క్లార్క్‌ తెలిపారు. 

వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ గుట్టు తేలేనా?

తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చినందున అది బిడ్డకు కూడా వ్యాపించిందా? అనేది వైద్యులను కలిచివేస్తున్న ప్రశ్న. ఇలా జరుగడాన్ని వైద్య పరిభాషలో వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. తల్లి గర్భంలోని పిండానికి కూడా వైరస్‌ వ్యాపిస్తుందా? అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలకు విషయంగా మారింది. కొన్నిరోజులక్రితం చైనాలో పరిశోధనలు కూడా జరిగాయి. అయితే, వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌పై పూర్తి నిర్ధారణ రాలేదు. లూసియానా ఘటనలో పసిగుడ్డుకు కరోనా ఉన్నట్టు తేలితే.. ఇది అతి తక్కువ వయసు కరోనా మరణంగా రికార్డులకెక్కనున్నది. అంతేకాకుండా ‘తల్లి గర్భంలోనూ కొవిడ్‌-19 వ్యాప్తిచెందుతుంది అనేది నిర్ధారణ అవుతుంది. అదే జరిగితే కరోనా విపత్తులో మరో ముప్పు పొంచిఉందనేది బహిర్గతమవుతుంది. 

పాలమూరులో పసికందుకు కరోనా

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 23 రోజలు చిన్నారికి కరోనా వైరస్‌ సోకిందని కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. కుటుంబసభ్యుల నుంచి చిన్నారికి కరోనా వ్యాపించినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం పాపను సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలోని ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. 


logo