జ్యోతినగర్, నవంబర్ 10 : రామగుండం ఎన్టీపీసీకి ప్రతిష్ఠాత్మకమైన పీఆర్సీఐ (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) కొలేటరల్ మూడు అవార్డులు లభించాయి. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని మోతీమహల్లో జరిగిన 18వ గ్లోబల్ కమ్యూనికేషన్ సమావేశంలో పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో అంతర్గత కమ్యూనికేషన్ ప్రచారానికి గోల్డ్ అవార్డు, కార్పొరేట్ కమ్యూనికేషన్ ఎక్సలెన్సీలో కాంస్య అవార్డు, మ్యూజిక్ వీడియో విభాగంలో కన్సోలేషన్ అవార్డు లభించింది. పీఆర్సీఐ అవార్డులను సొంతం చేసుకోవడంపై ఇక్కడి ఎన్టీపీసీ, సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్పాండు హర్షం వ్యక్తం చేస్తూ, కమ్యూనికేషన్ విభాగానికి అభినందనలు తెలిపారు.