సుల్తాన్‌బజార్, జనవరి 1 : రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ నిబంధనల ప్రకారం ఏడో పీఆర్సీని అమలు చేయాలని అడ్‌హక్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉద్యోగ భద్రత, సేవారక్షణ కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సంఘం నాయకులు కోరారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్యూలో అసోసియేషన్ ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 3న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తమ సమస్యల గురించి చర్చించాలని డిమాండ్ చేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం అవసరమైన అర్హతలు కలిగి ఉన్నా ఏడో పీఆర్సీని అమలు చేయడంలేదని వాపోయారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా తమకు అనుకూలమైన విధంగానే ఉన్నాయని వివరించారు. 25 ఏండ్లుగా సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలని కోరారు. 1200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు యూజీసీ పీఆర్సీ అమలు చేయాలని, 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్, పీహెచ్డీ ప్రోత్సాహకం, డీఏ, హెచ్ఆర్ఏ తక్షణమే చెల్లించాలని కోరారు. నిరసన అనంతరం నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో అడ్‌హక్ టీచర్స్ అసోసియేషన్ జేఎన్ఏఎఫ్ఏయూ కన్వీనర్ వెంకటేశ్వర్లు, కోకన్వీనర్ రామక్రిష్ణ, సంఘం నాయకులు కాంతారెడ్డి, గుర్రం మల్లేశ్, ఉదయ్‌శంకర్, హరీశ్ పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాదిలోనైనా సర్వీసు రూల్స్ రూపొందించి.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూటీఎస్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. టీచర్స్ సర్వీస్‌రూల్స్ లేకపోవడంతో విద్యావ్యవస్థలో సంక్షోభం నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ నాయకులు సయ్యద్ సాబీర్ అలీ, ఏవీ సుధాకర్, కరుణాకర్‌రెడ్డి, మాతంగి శంకర్, ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వర్రావు, ఇఫ్తీకారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): టూరిజంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టూరిజం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని సైతం కలిసి సమస్యలు వివరించినట్టు తెలిపారు. టూరిజం కార్పొరేషన్లో నెలకొన్న సమస్యలను పరిషరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.