
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విమర్శకుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావును ప్రతిభా పురస్కారం వరించింది. వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన ప్రముఖలకు ఏటా ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికిగాను మొత్తం 12 మందిని అవార్డులకు ఎంపికచేసింది. వీరికి ఈ నెలలోనే పురస్కారాలను ప్రదానం చేయన్నట్టు వెల్లడించింది. ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేయనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనవారిలో ఆచార్య నిత్యానందరావుతోపాటు రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), డీ అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్ గంగాధర్ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్ ఎస్కే వెంకటాచార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికా రంగం), రావుల వెంకట్రాజం గౌడ్ (నాటకం), కౌళ్ల తలారి బాలయ్య (జానపదం కళారంగం), డాక్టర్ మలుగ అంజయ్య (అవధానం), ఎన్ అరుణ (ఉత్తమ రచయిత్రి), చంద్రశేఖర్ ఆజాద్ (నవల) ఉన్నారు.