సిద్దిపేట, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ్వేల్: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ద్వారా ఒక్కో టీఎంసీ చొప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి సాగునీటిని విడుదలచేయాలని, లేని పక్షంలో వచ్చే నెల 2న రాజీవ్, జాతీయ రహదారులను వేలాది రైతులతో కలిసి దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీళ్లను వదిలి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, ఆలేరు నియోజకవర్గలకు చెందిన వేలాది రైతులతో కలిసి రాజీవ్, జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఎంతోమంది రైతుల త్యాగాల ఫలితంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ను నిర్మించుకున్నమని వాటి ఫలాలు ప్రతి రైతుకు అందేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
హల్దీ వాగులోకి కాళేశ్వరం జలాలను వదిలితే వంద కిలోమీటర్లు ప్రవహించి నిజాంసాగర్ వరకు చేరుతాయని, కూడవెళ్లి వాగులోకి కూడా సాగునీళ్లను వదిలితే అప్పర్‌మానేరు వరకు వంద కిటోమీటర్లు ప్రవహించడంతోపాటు సుమారుగా 40 చెక్‌డ్యాంలు నిండుతాయని, లక్ష ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. రెండు ప్రాజెక్టుల నుంచి సాగునీళ్లను వదలడంతోపాటు రామాయంపేట, సంగారెడ్డి, తుర్కపల్లి, జగదేవ్‌పూర్ కాలువలు, చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్‌కు ఒక్క ఫోన్ చేస్తే నీళ్లను వదిలేవారని, లక్షలాది ఎకరాల్లో పంటలు పండి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకియొద్దీన్ తదితరులు తదితరులున్నారు.
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయకపోవడం, వానలు సక్రమంగా పడకపోవడంతో జిల్లాలో వరినాట్లు 50% కూడా పూర్తి కాలేదు. చెరువులు, కుంటలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సకాలంలో రిజర్వాయర్లు నింపి వాటి ద్వారా చెరువులకు నీటిని విడుదల చేయడంతో నిండుకుండలా చెరువులు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం రిజర్వాయర్లలోకి నీటిని విడుదల చేయకపోవడంతో అవి డెడ్ స్టోరేజీకి చేరాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. బోర్ బావుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. రైతులు సాగు చేద్దామంటే నీరు లేదు. వరి నారు ముదిరిపోతున్నది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రిజర్వాయర్లలోకి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో రైతులు హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిని దిగ్భందం చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. బోర్లు తక్కువగా నీళ్లు పోస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు వరినాట్లు వేయలేకపోయారు. ఇప్పటికైనా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టులోకి వెళ్లే కాలువ నుంచి కొడకండ్ల వద్ద కూడవెళ్లిలోకి ప్రభుత్వం నీటిని వదలాలి. ఇలా చేస్తే చెక్‌డ్యాంలు నిండి, రైతులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను వదిలేందుకు వెంటనే చర్యలు తీసుకుంటే రైతులు సంతోషిస్తారు.
-మద్ది రాజిరెడ్డి, రైతు, అహ్మదీపూర్, సిద్దిపేట జిల్లా
వర్షాలు సరైన సమయంలో కురవకపోవడంతో భూగర్భ జలమట్టం తగ్గడంతో బోర్లు తక్కువగా పోస్తున్నయి. బోర్లలో నీళ్లు రాకపోవడంతో రైతులు చాలా వరకు నాట్లు వేయలేకపోయారు. కొండపోచమ్మ కాలువ ద్వారా కూడవెళ్లిలోని కాళేశ్వరం జలాలను వదిలితే చెక్‌డ్యాంలో నీళ్లు పుష్కలంగా చేరి బోర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. గత ప్రభుత్వం ఎప్పుడూ నీళ్లను కూడవెళ్లిలోకి వదలడంతో కూడవెళ్లి నిరంతరం కాలేశ్వరం జలాలతోనే కనిపించేది.
-కొత్తపల్లి రామగౌడ్, రైతు,అహ్మదీపూర్,సిద్దిపేట జిల్లా