కవాడిగూడ (హైదరాబాద్), మార్చి 29: లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దేశ వ్యాప్తంగా హిందూత్వ ఎజెండా అమలుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిద్దాం- సంక్షేమం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడుదాం అంటూ మార్చి 17న హన్మకొండలో ప్రారంభించిన జన చైతన్య బస్సు యా త్ర హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నాచౌక్ వద్ద ముగింపు సభను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభదం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో సంక్షేమాన్ని విస్మరించి కుబేరులకు వ త్తాసు పలుకుతున్నదని విమర్శించారు. పార్టీ లో చేరని వారిపై ఈడీ, సీబీఐ చేత అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. బీజేపీ కన్ను తెలంగాణ రాష్ట్రంపై పడిందని, రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రా వాలనే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సభలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు పోతునేని సుదర్శన్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లు లక్ష్మి, రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి టీ సాగర్ పాల్గొన్నారు.