Congress Govt | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): దరఖాస్తు.. దరఖాస్తు.. కాంగ్రెస్ సర్కారులో ‘దరఖాస్తు’ ఊతపదంగా మారిపోయింది. గతంలో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పకుండా మళ్లీమళ్లీ దరఖాస్తులు తీసుకుంటూ హంగామా చేస్తున్నది. ప్రజాపాలన దరఖాస్తులతో మొదలైన ప్రక్రియ ఏడాదికాలంగా కొనసాగుతూనే ఉన్నది. దరఖాస్తు చేసుకున్నా ఆ పథకం వస్తుందన్న నమ్మకం కూడా లేదంటూ నిట్టూరుస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పటివరకు అరడజనుసార్లు దరఖాస్తులు స్వీకరించింది. అధికారంలోకి రాగానే డిసెంబర్ 28న ప్రజాపాలన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత మళ్లీ ఎంపీడీవో ఆఫీసుల్లో రూ.500లకే గ్యాస్ కోసం, గృహజ్యోతి కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత రుణమాఫీ కోసం దరఖాస్తులు(ఫిర్యాదులు) స్వీకరించింది. పథకాల అమలు కోసం కులాల వారీగా లెక్క తీస్తామని ప్రకటించిన సర్కారు.. నిరుడు నవంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టింది. ఈ నివేదిక ఆధారంగా పథకాలు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు.
గ్రామసభల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు దరఖాస్తులు ఏమయ్యాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. సంక్షేమ ఫలాలు అందుతాయని కోటి ఆశలతో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అందులోనే దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో సుమారు 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1.17 కోట్ల కుటుంబాల కులగణన సర్వే చేయించింది. ఈ వివరాలతో ఆయా పథకాలకు అర్హులను ఎంపిక చేయవచ్చు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కారు ఏ పథకం అమలు చేసినా అందులో కోతలు, కొర్రీలే ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీమళ్లీ దరఖాస్తులు తీసుకోవడం వెనుక కోతలు పెట్టడమే లక్ష్యంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీమళ్లీ దరఖాస్తు చేసుకొనేందుకు చాలామంది వెనుకంజ వేస్తారు. పథకాల అమలును జాప్యం చేయడానికి దరఖాస్తుల స్వీకరణ పేరుతో కాలం గడిపేయొచ్చన్నది ప్రభుత్వం ఎత్తుగడ కావచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.