మక్తల్, మార్చి 21 : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని సబ్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో చందాపూర్‌కు చెందిన మహేశ్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఎర్సన్పల్లి శివారులో రైతుకు చెందిన పొలంలో విద్యుత్ లైన్ గుంజేందుకు కూలీలతో కలిసివెళ్లాడు. బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు కర్ని సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు సరిచేస్తున్నాడు. సబ్‌స్టేషన్‌లో ఉన్న ఏఎల్ఎం నితిన్, లైన్‌మన్ లక్ష్మప్ప నిర్లక్ష్యం వల్ల విద్యుత్ సరఫరా కావడంతో స్తంభంపై ఉన్న మహేశ్ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో కర్నె సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి సిబ్బంది ధర్నా చేశారు. మృతుడి కుటుంబానికి రూ.8లక్షల పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు.