Bhatti Vikramarka | హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): హైడ్రా, మూసీ నది వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో సినిమా ైస్టెల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా నగరంలో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయి, లండన్, జపాన్ నగరాల్లోని నదులు ఏ విధంగా ఉన్నాయో చూపించారు. అయితే, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఈ సమావేశం ఎందుకు పెట్టారు. సినిమా ఎందుకు ప్రదర్శించారు. జనాలకు ఏం చెప్పదలుచుకున్నారనే సందేహాలు సమావేశానికి హాజరైన విలేకరులను పీడించాయి. కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా మూసీ, హైడ్రాపై మాట్లాడలేకపోయారు. ఇప్పుడు స్వదేశానికి వచ్చిన ఆయన.. తాను కూడా ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో విలేకరుల సమావేశం నిర్వహించినట్టుగా ఉంది తప్ప, ఎలాంటి కొత్త విషయం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విలేకరులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు.
ప్రశ్న: మీరు చూపించిన లండన్‌లోని థేమ్స్, జపాన్‌లోని యోడా, సుమిధ నదులకు అనుకునే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మరి అక్కడ ఇండ్లను కూల్చనప్పుడు ఇక్కడ మూసీ నది కోసం ఎందుకు ఇండ్లను కూల్చుతున్నారు.
మంత్రి: కాలక్రమంలో అలా జరుగుతుంటాయి.
హైడ్రా కూల్చివేతలు ఆగుతాయా? కొనసాగుతాయా?
ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి.
మీరు చూపించిన శాటిలైట్ మ్యాప్‌ల ప్రకారం కబ్జా అయిన చెరువుల్లోని మొత్తం నిర్మాణాలను కూల్చివేస్తారా..?
ఏం చేయాలో మీరే చెప్పండి.
మ్రీరు ప్రదర్శించిన చెరువుల మ్యాప్‌ను అధికారికంగా పరిగణించవచ్చా?
సమాధానం కరువు
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న ఇండ్లను కూల్చివేస్తామని హైడ్రా చెప్తున్నది. మీరేమో బఫర్ జోన్ జోలికి వెళ్లడం లేదంటున్నారు. ఏది నిజం.
సమాధానం దాటవేత
పెద్ద పెద్ద వాళ్లు బఫర్ జోన్లో ఇండ్లు నిర్మించుకున్నట్టు ఆరోపణలున్న గండిపేట, హిమాయత్‌సాగర్, సకాలం చెరువుల్లోనూ ఆక్రమణలు గుర్తించారా?
అన్ని చెరువుల్లోని ఆక్రమణలను గుర్తించాం.
మీరేమో అసలు అంచనాలే సిద్ధం చేయనప్పుడు మూసీ ప్రాజెక్టుకు రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అని ఎవరు చెప్పారని అంటున్నారు. కానీ, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో ఎవరి మాట నిజం?
ఏదో ఓరల్‌గా చెప్పినవి కుదరవు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు. ఇంకా మేం అంచనాలనే సిద్ధం చేయలేదు.
మూసీ సుందరీకరణకు టెండర్లు ఖరారు కాలేదని మీరంటున్నారు. కానీ ఎంఏయూడీ కార్యదర్శి టెండర్లు పూర్తయ్యాయని, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు.
అధికారులు చెప్పింది వేరే అంశం గురించి కావొచ్చు. మూసీ సుందరీకరణను ఎలా చేయాలనే దానిపైనే ఇంకా టెండర్ వేయలేదు. అప్పుడే పనులు ఎలా ప్రారంభిస్తారు.