ఆత్మకూర్.ఎస్, మార్చి 15 : తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే బీఎన్ రెడ్డి (భీమిరెడ్డి నర్సింహారెడ్డి) చిరకాల కోరికను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం దాచారం గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ భీమిరెడ్డి నర్సింహారెడ్డి శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మలపెన్‌పహాడ్ ఎక్స్ రోడ్డులో బీఎన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీఎన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణాను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బీఎన్ రెడ్డి అని కొనియాడారు. బీఎన్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆంధ్రా కమ్యూనిస్ట్ నాయకుల మోసానికి బలైన నాయకుడు బీఎన్ అని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు బీఎన్ రెడ్డి పేరు పెట్టే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.