హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని కేఆర్ఎంబీ త్రీమెన్ కమిటీ నిర్ణయించింది. సోమవారం జలసౌధలో జరిగిన సమావేశంలో శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా సాగర్ అవసరాలను తీర్చాలని ప్రకటించి తెలంగాణకు 5.5 టీఎంసీలు, ఏపీకి 4.5 టీఎంసీలను కేటాయించింది.
శ్రీశైలం నడక మార్గంపై నిషేధం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు నల్లమల అటవీ గుండా కాలినడకన వెళ్లే దారిని అటవీశాఖ 3నెలలపాటు నిషేధించింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఎన్టీసీఏ ఆదేశాల మేరకు సెప్టెంబర్ వరకు అనుమతి లేదని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంది.
ఆన్లైన్లోనే ‘సీఎంఆర్ఎఫ్ ’
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ రూపొందించగా.. స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి లాగిన్ ఐడీ కేటాయించింది. సీఎంఆర్ఎఫ్ కోసం వారి వద్దకు వచ్చిన రోగుల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వీటితోపాటు వారి సిఫారసు లేఖను కూడా జత చేస్తారు. అప్లికేషన్ను పూర్తి చేసిన తర్వాత ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. అనంతరం ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సెక్షన్లో సమర్పిస్తారు. వివరాలన్నీ సరైనవేనని నిర్ధారణకు వచ్చాకే వాటిని సీఎంఆర్ఎఫ్కు పంపుతారు. ఆ తర్వాత దరఖాస్తును ఆమోదించి లబ్ధిదారుడికి చెకు అందజేస్తారు.