హైదరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్ యంత్రాల పంపిణీ చేపట్టాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే కుమ్మరి యువతకు ఆధునిక శిక్షణ ఇప్పించిన సీఎం కేసీఆర్కు కుమ్మరి సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాష్ట్రంలోని 3,500 మంది కుమ్మరి వృత్తిదారులకు ప్రభుత్వం ఆధునిక శిక్షణ ఇప్పించింది. ఈ శిక్షణ ద్వారా ఆధునిక యంత్రాలపై మంచి అవగాహన లభించింది. దాంతో మట్టి గణపతులు, వాటర్ బాటిళ్లు వంటి వస్తువుల తయారీని చేపట్టి ఉపాధి పొందుతున్నట్లు సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆధునిక పాటరీ వీల్స్ కోసం 20 శాతం డీడీల రూపంలో కడితే 80 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల విలువగల యంత్రాల్ని ప్రభుత్వం అందిస్తుందని, అందుకోసం దాదాపు 320 మంది రాష్ట్రవ్యాప్తంగా కుమ్మరి వృత్తిదారులు డీడీలు కట్టారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో డీడీలు కట్టిన వారికి యంత్రాల్ని అందిస్తూ పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. అదేవిధంగా ఇంకా డీడీలు కట్టడానికి సైతం అవకాశం కల్పించాలన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యలపై తక్షణమే స్పందిస్తూ ఆదేశాలు జారీ చేసిన మంత్రికి రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, ఉపాధ్యక్షులు ఉరిటి వెంకట్రావు ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి పావని ప్రజాపతి, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండవీటి ప్రణీత రాణి ప్రజాపతి, సంయుక్త కార్యదర్శి దూగుంట్ల నరేష్ ప్రజాపతి, ప్రచార కార్యదర్శి నాగపురి భాస్కర్ ప్రజాపతి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్ బి రాములు ప్రజాపతి, కుమ్మరి యాదగిరి ప్రజాపతి, ఎన్, మల్లికార్జున్ ప్రజాపతి, శిక్షణ పొందిన వృత్తిదారులు కుమ్మరి కృష్ణ ప్రజాపతి, కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, తదితరులు పాల్గొన్నారు.