హైదరాబాద్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖలో ఖాళీగా ఈఎన్సీ, సీఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. వారంలోగా ఖాళీపోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవలే రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఈఎన్సీ రామగుండం, ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ ఓఅండ్ఎం పోస్టులను రెగ్యులర్ అధికారులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సూపర్ న్యూమరరీ పోస్టుగా మరో ఈఎన్సీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఈ శాఖలో మొత్తం 29 సీఈ పోస్టులకు గాను ప్రస్తుతం 16 మందే రెగ్యులర్ సీఈలు ఉన్నారు. మిగతా పోస్టుల్లో ఇన్చార్జీలు కొనసాగుతున్నారు. ఎస్ఈ, ఈఈ పోస్టులకూ జాబితాలను సిద్ధం చేసినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఇరిగేషన్ శాఖలో కొత్తగా నియమితులైన 687 మంది ఏఈలకు వారం రోజుల్లోనే పోస్టింగ్ ఆర్డర్లను ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
‘ఆర్టీసీ’ విలీన ప్రక్రియను పూర్తిచేయాలి ;ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ఎస్‌డబ్ల్యూయూ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2013 వేతన సవరణ బాండ్ల డబ్బులను డ్రైవర్లు, కండక్టర్లకు ఇచ్చిన యాజమాన్యం.. మిగిలిన మెకానిక్‌లు, సెక్యూరిటీ, సూపర్ వైజర్స్, ఆఫీస్, మెడికల్ సిబ్బందికి చెల్లించకపోవటంతో వారిలో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను రద్దు చేసి వెల్ఫేర్ కమిటీలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. తక్షణమే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, విలీన కమిటీలో ట్రేడ్యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని, 2017వేతన సవరణకు సంబంధించిన అలవెన్స్‌ను వడ్డీతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేశారు.