యాదాద్రి, జూలై 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు సకల వసతులతో కూడిన కాటేజీలను వైటీడీఏ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీవీఐపీ, వీఐపీ, దేశ విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథుల నిమిత్తం దాతల సాయంతో నిర్మించిన ప్రెసిడెన్సియల్ సూట్లను సామాన్య భక్తులకూ అందుబాటులో ఉంచారు. విల్లాలో బెడ్రూం కలిగిన ఒక్క రూమ్‌కు రోజుకు రూ.3 వేలు, 5 బెడ్రూంలు కలిగిన పూర్తి విల్లాకు రూ.15 వేల అద్దె నిర్ణయించారు. దీంతోపాటు భక్తులకు ఎస్కార్టెడ్ దర్శన సౌకర్యం కల్పించనున్నారు.
ప్రెసిడెన్సియల్ సూట్ ఇది ఒక్కప్పుడు కేవలం వీవీఐపీలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక విడిది. అటువైపు వెళ్లాలంటే చుట్టూ సెక్యూరిటీ. సామాన్యుడు అటువైపు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడా ప్రెసిడెన్సియల్ సూట్లోని కాటేజీలను వైటీడీఏ అధికారులు సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. స్వయంభువులను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు రెండుమూడు రోజులు ఇక్కడే ఉండే విధంగా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు యాదాద్రీశుడి దర్శించుకొనేందుకు వస్తుంటారు. వీఐపీ, వీవీఐపీలతోపాటు సాధారణ భక్తులు సైతం వచ్చి దర్శించుకొంటారు. వీవీఐపీల విడిది కోసం కొండ దిగువన ఉత్తరాన 13.26 ఎకరాల్లో చిన్న కొండపై 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్సియల్ సూట్ నిర్మించారు. దాతల ఆర్థిక సాయంతో రూ.143.80 కోట్లతో నిర్మాణం చేపట్టగా పనులు పూర్తయ్యాయి. ఇందులో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో 15,500 చదరపు అడుగులో ప్రెసిడెన్సియల్ సూట్‌ను కొండ శిఖరాగ్రాన మహాద్భుతంగా నిర్మించారు. ఆ కింది ప్రాంగణంలో నాలుగు విల్లాలు, దిగువన మరో పది విల్లాలు పూర్తయ్యాయి. ఒక్కో దాన్ని 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తుల్లో నిర్మించారు. ఇందుకు గాను ఒక్కో విల్లాకు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారు. వీవీఐపీ కోసం నిర్మించిన విల్లాల్లో సామాన్య భక్తులు సైతం విడిది చేసేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. ఒక్కో విల్లాలో 5 బెడ్రూంలు ఉండగా, 14 విల్లాల్లో మొత్తం 70 బెడ్రూంలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో బెడ్రూంను రూ.3 వేలకు అద్దెకు ఇచ్చేందుకు వైటీడీఏ అధికారులు నిర్ణయించారు.
ఒక్కో విల్లాలో 5 బెడ్రూంలు, వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు కొండపైన స్వామివారి ఆలయాన్ని తిలకించేందుకు సిట్ ఔట్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. ఉడెన్ ప్లాస్టిక్‌తో కిటికీలు, టేకుతో తయారు చేసిన ద్వారాలను బిగించారు. బెడ్రూంలలో సెంట్రల్ ఏసీ, పక్కనే బాత్ రూమ్‌లో కోయిలర్ గ్లాస్‌తో సెన్సర్ సిస్టం ఏర్పాటు చేశారు. యాదాద్రీశుడిని దర్శించుకొని తిరిగి ప్రెసిడెన్సియల్ సూట్‌కు వచ్చేందుకు ప్రత్యేకంగా రోడ్లను నిర్మించారు. ప్రధానంగా సూట్లో ఏకకాలంలో 5 కుటుంబాలు విడిది చేయవచ్చు. 25 మంది కూర్చునేలా వెయిటింగ్ లాంజ్‌లు, 50 మందితో సమావేశం ఏర్పాటు చేసేందుకు విశాలమైన కాన్ఫరెన్స్ హాళ్లను నిర్మించారు.
యాదగిరిగుట్ట ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దాం. దివ్య సన్నిధి పేరుతో 15 డోనర్ కాటేజీలను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాటేజీలో 5 బెడ్రూంలు, 5 సీట్లు, ప్రత్యేకంగా డైనింగ్, డ్రాయింగ్ రూమ్‌లు ఉన్నాయి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగించుకోవాలి. https://booking.ytda.in/ వెబ్ సైట్లో రూమ్‌లను బుక్ చేసుకొనే వీలుంది. కాటేజీలో అద్దెకు వచ్చిన భక్తులకు తోడుగా దేవాలయ సిబ్బందిని పంపి ప్రత్యేక దర్శనం చేయించే వెసులుబాటు ఉన్నది.
– కిషన్‌రావు, వైటీడీఏ వైస్ చైర్మన్