రఘునాథపాలెం, ఆగస్టు 27: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్లలో పేదలు వేసుకున్న రేకుల షెడ్లు, గుడిసెల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. సర్వే నంబర్ 148, 149లో నిరుపేదలు నిర్మించుకున్న రేకుల షెడ్లను తొలగించేందుకు పోలీసులు జేసీబీలతో రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న పేదలు జేసీబీలకు అడ్డంగా నిల్చొని కూల్చివేతలను నిలువరించారు. ఏసీపీ రమణమూర్తి, పలువురు సీఐలు మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినా ఏమాత్రమూ తగ్గలేదు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని నిలదీశారు. పట్టా భూములను ఆక్రమించి షెడ్లు నిర్మించడం సరికాదని, షెడ్లు వేయించిన నాయకులకు రెండు నెలలుగా తొలగించాలని చెప్పిన విషయాన్ని ఏసీపీ రమణమూర్తి మైక్ ద్వారా పేదల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన పేదలు.. తమకు రెండు రోజుల గడువు కావాలని, స్వచ్ఛందంగా షెడ్లను తొలగిస్తామని ఏసీపీని వేడుకున్నారు. దీనికి నిరాకరించిన పోలీసులు.. మరోమారు యంత్రాలతో రేకుల షెడ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసుల ప్రయత్నం విఫలం కావడంతో పట్టా భూమి యజమానులు 100 మందికి పైగా రంగంలోకి దించారు. వారంతా మద్యం మత్తులో అక్కడున్న పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదంతా పోలీసుల కండ్లముందే జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర పోషించారు.
భూదాన్ భూమి పేరుతో కొందరు వ్యక్తులు తమ దగ్గర రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని, దగ్గరుండి మరీ 100 గజాల చొప్పున జాగా చూపించి షెడ్లు వేయించారని నిరుపేదలు వాపోయారు. తీరా చూస్తే తాము గుడిసెలు వేసుకున్న భూమి పట్టా అని తేలడంతో మోసపోయామని గుండెలు బాదుకుంటూ రోదించారు.