హుస్నాబాద్, అక్టోబర్ 16: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం అర్థరహితమని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు, దళిత సంఘాలు, వివేక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎలక దేవయ్య మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం మాట్లాడుతూ విద్యార్థి వివేక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నైలాన్ తాడుకు ఉరిపడి చనిపోయాడని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వివేక్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వివేక్‌ను హత్యచేసి ప్రమాదవశాత్తు చనిపోయాడని చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వివేక్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.