హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): భూ సంబంధిత సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిషారం చూపడమే లక్ష్యంగా జిల్లాల వారీగా శుక్రవారం నుంచి సమీక్షలు నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాజధాని నగరం పరిసర జిల్లాల సమీక్షలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇతర జిల్లాల్లో జరిగే సమీక్షలకు మంత్రులు స్వయంగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు.
రెవెన్యూ అంశాలతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, హౌసింగ్ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణాల పురోగతి, స్థలాల సమస్యలు తదితర అంశాలను కూడా జిల్లా సమీక్షల్లో ఆయా మంత్రులు పరిశీలించనున్నట్టు తెలిపారు. తొలిరోజైన శుక్రవారమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షను జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారని, శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షను ఆ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారని మంత్రి తెలిపారు.