ఖమ్మం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హరిత ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి(దరిపల్లి) రామయ్యకు ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు, అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య.. శనివారం తెల్లవారుజామున ఆయన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆదివారం ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు రామయ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. రామయ్య ఆఖరి మజిలీ పూర్తయ్యేవరకు ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల సందర్భంగా పాడె మోశారు. వనజీవి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరిగినప్పటికీ అధికారిక లాంఛనాలతో మాత్రం జరగలేదు.
అంత్యక్రియల్లో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు రెడ్డిపల్లిలోని రామయ్య ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ చివరిసారిగా రామయ్య పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అటవీశాఖ సిబ్బంది పరేడ్ అనంతరం అంతక్రియలు ముగిశాయి. రామయ్య అంత్యక్రియలు పూర్తయిన అనంతరం అక్కడి వైకుంఠధామంలో ఆయన అభిమానులు మొక్కలు నాటారు. ఆర్డీఓ నర్సింహారావు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, ప్రముఖ సామాజిక వేత్తలు పాల్గొన్నారు.
మరికాసేపట్లో వనజీవి అంతిమయాత్ర ప్రారంభం కాబోతున్న సమయంలో ఆయన సతీమణి జానకమ్మ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న జిల్లా దవాఖానల సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్ జానకమ్మకు ప్రాథమిక వైద్యం అందించారు.
పద్మశ్రీ రామయ్య పార్థివదేహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, నీటిపారుదల, అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు రెడ్డిపల్లిలో అంజలి ఘటించారు.