హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ మణికొండ: ‘మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు హర్షారెడ్డి మా భూములు ఇవ్వకపోతే చంపేస్తామంటున్నా రు.. మమ్మల్ని ఇక్కడే చంపి సజీవంగా పాతిపెడుతామని బెదిరిస్తున్నారు’ అని వట్టినాగులపల్లి బాధితులు సతీశ్ షా, పల్లవీ షా మీడి యా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. కేటీఆర్‌తో కలిసి సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. వట్టినాగులపల్లిలో రూ. వందల కోట్ల విలువజేసే తమ భూముల కబ్జాకు మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. తమ భూమిని ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో గూండాలతో భయపెట్టించారని, తమ గోడలను అక్రమంగా కూల్చివేశారని, 70 మంది గూండాలు, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి తమ సిబ్బందిని కొట్టి ప్రహరీని కూల్చివేశారని వివరించారు.
1969 నుంచి ఇప్పటి వరకు మా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నం. ఇటీవల పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి వచ్చారు. తర్వాత వాళ్ల తండ్రి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా వచ్చి మా భూమిలోంచి రెండు, మూడు ఎకరాలు ఇవ్వాలని అడిగారు. తర్వాత మొత్తం భూములు ఇవ్వాలని బెదిరించారు. మేము మా భూములు డెవలప్మెంట్కు కానీ, అమ్మకానికి కానీ ఇవ్వమని తేల్చి చెప్పాం. దీంతో సర్వేయర్ శ్రీనివాస్ మాకు తెలియకుండానే మా భూములు సర్వేచేశారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పొంగులేటి హర్షారెడ్డి భూ పంచనామా చేశారు. అక్రమంగా చేసిన సర్వే పంచనామాను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో నవీన్ మిట్టల్, పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఈ భూముల కోసం మీటింగ్ పెట్టుకున్నరు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక రోజు రాత్రికి రాత్రే 70 మంది గూండాలు నంబర్ ప్లేట్లు లేని జేసీబీ బుల్డోజర్లు తెచ్చి గోడలు కూల్చి కబ్జాకు ప్రయత్నించారు. మొత్తం 5 సార్లు మాపై దాడి చేసిండ్రు. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. గచ్చిబౌలి పోలీస్ ఆఫీసర్ హబీబ్ మాకు న్యాయం చేశారని రాత్రికి రాత్రే ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు.
-బాధితుడు సతీశ్ షా
దీపావళి నుంచీ మా కుటుంబమంతా భయంతో బతుకుతున్నం. మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 2021లో మేము భూమి సర్వే చేసుకొని కంపౌండ్ వాల్ కట్టుకున్నం. మేము ఎవరి భూమిలోకి వెళ్లలేదు. మా భూమిని ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదు. భూమి ఇవ్వాలని మాపై ఒత్తిడి చేసిండ్రు. ఇవ్వకుంటే గూండాలతో భయపెట్టించారు. మా గోడలను అక్రమంగా కూల్చివేశారు. 70 మంది గూండాలు జేసీబీలతో వచ్చి సిబ్బందిని కొట్టారు. సినిమాల్లో రౌడీలు వచ్చి ప్రజలను ఎలా ఇబ్బందులు పెడుతారో అదే తరహాలో పొంగులేటి కుటుంబం మాపై దౌర్జన్యం చేస్తున్నది. భూమి ఇవ్వకుంటే సజీవంగా పాతి పెడుతామని బెదిరిస్తున్నారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబ్ మాకు న్యాయం చేశారని ఆయనను బదిలీ చేశారు. మా గోశాలను కూల్చివేసి గోవులను రోడ్డుపై వదిలేశారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా అక్రమార్కులు దాడులు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో అర్థంకావడం లేదు.
-బాధితురాలు పల్లవీ షా