హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనపై తెలంగాణ పాలిటెక్నిక్ యాక్షన్ కమిటీ(టీపీ జేఏసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఉద్యోగులను కార్మికశాఖలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దశాబ్దాల చరిత్ర గల డిప్లొమా విద్యను మింగేస్తారా..? అంటూ ప్రశ్నించింది. విలీనం చేస్తే టెక్నిక్ ఎడ్యుకేషన్‌కు టాటా చెప్పినట్టేనని, పాలిటెక్నిక్ విద్యతో ప్రయోగాలు వద్దని కోరింది.
ఈ విషయంపై విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని ప్రస్తావించింది. జీవో 97ను ఉపసంహరించుకునే వరకు శాంతియుతంగా పోరాడుతామని జేఏసీ స్పష్టంచేసింది. పాలిటెక్నిక్ విద్య ఆధునికీకరణ, విద్యార్థులు – విద్య, ఉద్యోగ ప్రయోజనాల పరిరక్షణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ శనివారం సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా టీపీ జేఏసీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. జేఏసీ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ జనరల్ శ్రావణ్‌కుమార్ తదితరులు కమిటీ ముందు పలు వాదనలు వినిపించారు. జీవో -97లో నాలుగో పాయింట్ తీవ్ర అభ్యంతరకరమని, దీంతోనే ఆందోళన నెలకొన్నదని అభిప్రాయపడ్డారు.

సాంకేతిక విద్యలోనే కొనసాగించండి..
పాలిటెక్నిక్‌ను శక్తిశాఖలోకి కాకుండా సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని జేఏసీ స్పష్టంచేసింది. ప్రస్తుత విద్యాశాఖ పరిధిలో కొనసాగితే విద్యా ప్రమాణాలు, నియంత్రణకు అకాశముంటుందని, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాలను రక్షించవచ్చని ప్రస్తావించింది. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన అకడమిక్ వ్యవహారాలు, పరీక్షలు, డిప్లొమా సర్టిఫికేషన్ బాధ్యతలను నిర్వహిస్తున్న సాంకేతిక విద్యామండలిని (ఎస్బీటెట్) యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఏర్పాటై ఈ సంస్థ పనిచేస్తున్నదని కనుక మండలిని రద్దు చేయవద్దని కోరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ కాలేజీల్లోని అధ్యాపకులు, విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అధ్యాపకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
సంప్రదించకుండా ముందుకెళ్లం : కే కేశవరావు
పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉద్యోగుల జేఏసీలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోబోమని హై లెవల్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు స్పష్టం చేసినట్టు జేఏసీ నేతలు వెల్లడించారు. జేఏసీ వాదనలు సహేతుకంగా ఉన్నాయని అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ముందుకెళ్తామని హామీనిచ్చినట్టు చెప్పారు. విద్యావ్యవస్థలో మార్పులు విద్యార్థులకు నష్టం వాటిల్లే విధంగా ఉండకూడదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడగా, కమిటీ సభ్యురాలు శాంతాసిన్హా స్పందిస్తూ. పాలిటెక్నిక్ విద్య పేద, బడుగు, బలహీన విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే విద్య అని కొనియాడినట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఈ అంశంపై మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని, విద్యార్థులు, అధ్యాపకులను సంప్రదించకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయబోమని తమకు చెప్పినట్టు నేతలు వెల్లడించారు.