సీసీసీ నస్పూర్/చేర్యాల/వేములవాడ రూరల్/కొత్తగూడెం గణేష్ టెంపుల్/ఖలీల్‌వాడి, ఆగస్టు 21 : కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97ను తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు సర్కార్‌పై కన్నెర్ర జేశారు. శుక్రవారం రోడ్లపై బైఠాయించి ‘సీఎం డౌన్, డౌన్.. విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి.. జీవో 97ను రద్దు చేయాలి.. వియ్ వాంట్ జస్టిస్..’ అంటూ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినదించారు. బీఆర్ఎస్వీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సీసీసీ కార్నర్ చౌరస్తాలో సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నాయకులు, విద్యార్థులను రోడ్డుపై నుంచి లాక్కెళ్లారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ పాల్గొని విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి వారికి సంఘీభావం ప్రకటించారు.
పాలిటెక్నిక్ విద్యను ఎట్టిపరిస్థితుల్లో నిర్వీర్యం చేయనివ్వబోమని, జీవో 97ను రద్దు చేసేంత వరకూ బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అండగా ఉంటారని దివాకర్‌రావు విద్యార్థులకు హామీ ఇస్తూ వారికి భరోసా కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ నాయకులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకోవడంతో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని ఎంఈవో కార్యాలయంలో విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నిజామాబాద్‌లోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. కాలేజీ గేటు ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఈసెట్ రాసే అర్హత కోల్పోయి కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పని చేసే పరిస్థితులు ఏర్పడుతాయని వాపోయారు. డిప్లొమా విద్యార్థులకు అమల్లో ఉన్న లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.