వికారాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తాండూరు నియోజకవర్గంలో రెండు దశాబ్దాలపాటు రాజకీయంగా ఏకఛత్రాధిపత్యంలా వ్యవహరించిన పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పుడు డీలా పడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాను చెప్పిందే వేదంలా కొనసాగింది. ఆయన సూచించిన వారికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితులు ఉండేది.
కానీ, 2018 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన నాటి నుంచి తాండూరు నియోజకవర్గంలో ఆయనకు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసినా రాజకీయంగా మాత్రం ఆయన బలం తగ్గుతూ వచ్చిందనే అభిప్రాయం ఉన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోవడం, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడంతో ఆయన అనుచరవర్గం కూడా క్రమంగా దూరమైంది.
తాండూరు నియోజకవర్గంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన మహేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీచేయలేదు. బీఆర్ఎస్ నుంచి రోహిత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో మనోహర్‌రెడ్డి పోటీచేశారు. పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పనిచేసినా ఎమ్మెల్యే టికెట్ మాత్రం బీఆర్ఎస్ అధిష్ఠానం రోహిత్‌రెడ్డికే ఇచ్చింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీలో చేరినా తాండూరు ఎమ్మెల్యేగా మనోహరెడ్డి గెలువడంతో అక్కడ మహేందరెడ్డి గ్రాఫ్ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని మహేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లోనైనా బరిలో నిలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మనోహర్‌రెడ్డి మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉండటంతో పట్నం అయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ నుంచి దారులు మూసుకుపోవడంతో ఇటీవల ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించగా.. అందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం అంగీకరించలేదని సమాచారం. రోహిత్‌రెడ్డిని కాదని మరొకరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే దానిపై మహేందర్‌రెడ్డి సందిగ్ధంలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే తన రాజకీయ ప్రస్థానానికి ఫుల్స్టాప్ పెడుతారనేది తేలియాల్సి ఉన్నది.