(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ సహా అన్ని పార్టీలు నేరచరితులకు భారీగా టికెట్లు ఇచ్చాయి. మొత్తంగా 412 మంది ఎన్నికల బరిలో ఉంటే వారిలో 94 మంది(23 శాతం) నేర చరిత్ర కలిగి ఉన్నారు.
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇది ఎక్కువని హిమాచల్‌ప్రదేశ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ పేర్కొన్నది. నేర చరిత్ర కలిగి ఉన్న అభ్యర్థుల సంఖ్య గత ఎన్నికల్లో 61గా ఉండగా.. ఇప్పుడు అది 94కు చేరుకొన్నది. వీరిలో 50 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ నుంచి 36 మంది, బీజేపీ- 12, ఆప్-12, సీపీఎం-7, బీఎస్పీ నుంచి ఇద్దరు ఉన్నారు.