నిజామాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కమ్యూనిస్టు నేతలతోపాటు పలువురిని అర్ధరాత్రి నుంచి అదుపులోకి తీసుకుంటున్నారు. అమిత్ షా వస్తుండటంతో ఆందోళనలు చేసే అవకాశం ఉన్నదన్న కారణం చూపుతూ గృహనిర్బంధాలు చేస్తున్నారు. కాగా, కేసీఆర్ పాలనలో నిర్మించిన భవనంలోకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అడుగు పెడుతుండటం గమనార్హం.
కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నా యకులు నానా యాగి చేస్తున్నారు. ప్రజాపాలన, సంక్షేమాన్ని మరిచి గులాబీ బాస్ కేంద్రంగా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నిత్యం కేసీఆర్ నామ జపం చేయనిదే ఆ రెండు పార్టీల నాయకులకు పొద్దుగడువదు. పదేండ్లపాటు కేసీఆర్ పాలనను తిట్టిపోసిన బీజేపీ పెద్దలకు.. కేసీఆర్ కట్టించిన భవనమే ఇప్పుడు దిక్కయింది.
పసుపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, అమిత్ షా ఫొటోలు ఉంచారు. ముఖ్యఅతిథిగా అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్లను ముద్రించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు అందులో లేవు. ప్రభుత్వ సలహాదారులకు కూడా చోటుఇవ్వలేదు. జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన వ్యక్తులతో ఒకరోజు ముందు సాదాసీదాగా కార్డులను పంపించారు. ఆహ్వాన పత్రికలో జిల్లాకు చెందిన నేతలందరి పేర్లు పెట్టాల్సి వస్తుందనే కారణంతోనే ఎంపీ అర్వింద్ తెలివిగా తన పేరు లేకుండా చూసుకున్నట్టు పలు పార్టీల నేతలు చెప్తున్నారు.