హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గద్దల్లా పడి దోచుకోవడానికి మరిగిన కొందరు బ్రోకర్లు దేనినీ వదిలిపెట్టడంలేదు. ఈ బ్రోకర్ల కన్ను ఇప్పుడు ‘తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్'(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలోని యూకలిప్టస్ తోటలపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎఫ్డీసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో 71 యూకలిప్టస్ తోటలు ఉన్నాయి. కోతకు వచ్చిన ఈ చెట్లను బహిరంగ వేలం ద్వారా పేపర్ ఉత్పత్తి చేసే కంపెనీలకు విక్రయిస్తుంటారు. ఈ ఏడాది కూడా మొత్తం 1.38లక్షల మెట్రిక్ టన్నుల యూకలిప్టస్ పల్ప్వుడ్ను విక్రయించాలని కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నది. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు యూకలిప్టస్ అమ్మకాల ద్వారా ప్రతి సంవత్సరం మంచి ఆదాయం వస్తుంది. ఈఏడాది వీటి విక్రయాల ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు రావచ్చని అధికారులు అంచనా వేశారు. విడుతల వారీగా వీటి విక్రయానికి ఈ-టెండర్లను ఆహ్వానించారు. తొలి విడుతకు మే 30న, రెండో విడతలో జూన్ 11, తదుపరి జూన్ 24వ తేదీల్లో అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అప్సెట్ ధరను కూడా నిర్ణయించారు. ప్రతి టన్నుకూ రూ.9900 ఉంటుందని ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ప్రధాన పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. రాష్ట్రంలోని యూకలిప్టస్ పల్ప్‌ను ఐటీసీ, జేకే పేపర్, గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. ప్రతిఏటా ఈ తరహాలోనే ప్రభుత్వం పారదర్శకంగా వీటి అమ్మకాలు చేపడుతుంది. కానీ, ఈసారి రాజకీయ జోక్యం పెరిగింది.
టీజీఎఫ్డీసీ నుంచి పత్రికల్లో ప్రకటన వచ్చిన తర్వాత టెండర్లను నిలిపివేయాలని, అమ్మకాలకు ఇది అనువైన సమయం కాదని మార్కెట్లోని కొందరు పోటీదారులు ఫిర్యాదు చేశారని చెప్తూ టీజీఎఫ్డీసీకి మంత్రి పేషీ నుంచి లేఖ అందింది. తాము అన్నిరకాలుగా శాస్త్రీయ పద్దతుల్లో మదించి చెట్ల ఎంపికను పూర్తిచేసి టెండర్లను పిలిచామని, ఈ దశలో టెండర్లను నిలిపివేయడం సాధ్యం కాదని టీజీఎఫ్డీసీ అధికారులు మంత్రి పేషీకి తేల్చి చెప్పారు. ఒకవేళ ఇప్పుడు టెండర్ ప్రక్రియను నిలిపివేస్తే టీజీఎఫ్డీసీ తీవ్రంగా నష్టపోతుందని, రాబోయే నెలల్లో మనకు పోటీదారులైన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు లక్షల 60వేల మెట్రిక్ టన్నుల యూకలిప్టస్ పల్ప్‌ను విక్రయించబోతున్నదని, వారు తెలంగాణకన్నా తక్కువ ధరను నిర్ణయించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేగనుక జరిగితే మన యూకలిప్టస్ పల్ప్నకు డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉన్నదని వివరించారు. డిమాండ్ పడిపోతే యూకలిప్టస్ చెట్లను అలాగే ఉంచాల్సి వస్తుందని, ఈ ఏడాది సుమారు రూ.137 కోట్లను తెలంగాణ నష్టపోతుందని హెచ్చరించారు.
ఈ మొత్తం వ్యవహారంలో తమకు సహకరించలేదని ఓ మహిళా అధికారిపై మంత్రి పేషీ కక్ష పెంచుకుంటున్నట్టు సమాచారం. పీసీసీఎఫ్ రేసులో ఉన్న ఆ అధికారిని ఆ స్థాయికి వెళ్లకుండా చేస్తామని మంత్రి పేషీలోని షాడో మంత్రి శపథం చేసినట్టు సమాచారం. అధికారుల వ్యవహారం మంత్రి పేషీకి కొరుకుడు పడటంలేదు.
ఇక టెండర్ల ప్రక్రియ ముందుకు వెళ్తుందని, ఈ దశలో ప్రభుత్వానికి నష్టం జరిగే చర్యలు తీసుకోలేమంటూ అధికారులు తేల్చిచెప్పారు. దీనికి షాడో మంత్రి కస్సుబుస్సులాడినట్టు తెలిసింది. తాము చెప్పినప్పుడే టెండర్లు పిలువాలని గట్టిగా చెప్పేప్రయత్నం చేశారు. ఇప్పటికే టెండర్లు పిలిచిన లాట్లకు సంబంధించి వదిలివేద్దామని, ఇంకా పిలువాల్సిన లాట్లను మాత్రం తాము చెప్పినపుడు పిలువాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఒక్కొక్క లాట్లో ధరల విషయంలో కూడా తేడాలుండేలా చూడాలని, అప్సెట్ ధరను రూ.7వేల వరకు పెట్టాలని, రూ.9900 పెట్టడం వల్ల కొనుగోలుదారులు రారని, తమకు ఈమేరకు విజ్ఞప్తులు వస్తున్నాయని వారు చెప్పినట్టు సమాచారం. రూ.7వేలకు టన్ను విక్రయించడం నష్టమని, ఇప్పటికే టెండర్‌దారులు సిండికేట్ అయ్యి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని, వారు మరింత తక్కువ ధర కోట్ చేసే ప్రమాదం కూడా ఉంటుందని అధికారులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. అయితే, ఇప్పటి వరకు ఒక లాట్‌కు మాత్రమే టెండర్ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. మిగిలిన వాటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది.