(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగైనా గుజరాత్లో తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రాష్ట్రంలో మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు.
అందుకే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఆలస్యానికి కేంద్రం పావులు కదిపిందని విపక్షాలు ఆరోపించాయి. వాస్తవాలను విశ్లేషిస్తే అందులో వాస్తవం లేకపోలేదు. కొంతకాలంగా అక్కడి ప్రభుత్వ పనితీరుపై వివిధ వర్గాలు మండిపడుతున్నాయి. గ్రామీణులు, రైతులు, పశువుల పెంపకందారులు, గిరిజనులు, డాక్టర్లు, టీచర్లు, అటవీ శాఖాధికారులు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు, మాజీ సైనికులు, మధ్యాహ్మ భోజన సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రేషన్ డీలర్లు ఇలా ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు.
గుజరాత్ పోలీసు విభాగంలో పనిచేసే హోమ్ గార్డు నుంచి డీజీ వరకు ‘యస్.. బాస్’ అని పనిచేస్తారు. సర్వీసు ట్రైనింగ్‌లోనే వారికి చెప్తారు. అలాంటిది.. ఆ రాష్ట్ర పోలీసులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
పట్టణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులను నియంత్రించడానకి, వాటిని పోషణకు గుజరాత్ ప్రభుత్వం తెచ్చిన చట్టం పట్ల పలువురు పశువుల పెంపకందారులు అసంతృప్తితో ఉన్నారు. ఇస్తామన్న నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడమే దీనికి కారణం. దీంతో గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో సెప్టెంబర్‌లో పశువుల పెంపకందారులు ‘చలో అసెంబ్లీ’ ఆందోళన చేపట్టారు.
పార్-తాపీ-నర్మద నదులను కలిపే ప్రాజెక్టును గిరిజనులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. గత మార్చిలో నవసారి జిల్లాకేంద్రంలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీని ప్రభావం గిరిజన ప్రాంతాలైన చాలా జిల్లాల్లో ఉంటుంది.
ప్రభుత్వ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది ప్రభుత్వ వైద్యులు ఆందోళన చేశారు. అలాగే, ‘పీజీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు సర్వీసు చేయాలి లేదా రూ. లక్షల జరిమానా చెల్లించాల’న్న ప్రభుత్వ నియమానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.
గ్రామీణ వైద్య వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆశా వర్కర్లు కూడా జీతాల కోసం రోడ్డెక్కారు. ఇతర రాష్ర్టాలలో ఉన్న జీతాలతో పోల్చుతూ గుజరాత్ ఆశా వర్కర్లు ఏకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు.ఆందోళనతో గుజరాత్ ప్రభుత్వం దిగి వచ్చి వేతనం రూ.2,500 పెంచింది. అయినా ఇతర రాష్ర్టాల కంటే తక్కువగానే ఉండటంతో ఆశావర్కర్లు అసంతృప్తితోనే ఉన్నారు.
గౌరవ వేతనంగా ఇస్తున్న రూ.1,400 పెంచాలంటూ ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవట్లేదని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. మిగతా డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటంలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని రేషన్ డీలర్లు గత జూన్‌లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆ ఆందోళనకు నాయకత్వం వహించింది స్వయానా ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ. తమకిచ్చే కమీషన్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం వారి కమీషన్‌ను పెంచలేదు.
కొవిడ్ సమయంలో తాము ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేసినా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పట్టించుకోవటం లేదంటూ ఆగస్టులో హెల్త్ వర్కర్లు విధులకు హాజరు కాకుండా ఆందోళన చేశారు. 4 వారాల అనంతరం.. హెల్త్ వర్కర్లను ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ గుజరాత్ ప్రభుత్వం హెచ్చరించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించింది. అయినప్పటికీ, ఉద్యోగులు ఆందోళనలను విరమించకపోవడంతో ప్రభుత్వమే దిగివచ్చి డిమాండ్లు ఒప్పుకుంటున్నట్టు ప్రకటించింది. కానీ ఆ ప్రక్రియ చేపట్టలేదు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుధ్ధరించాలనే డిమాండ్‌తో గుజరాత్లో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ కోసం ఉద్యమిస్తుంటే, మిగతావారు ఇతర రాష్ర్టాలతో పోలిస్తే గుజరాత్లో జీతభత్యాలు తక్కువగా ఉన్నాయంటూ ఆందోళన బాటపట్టారు.
బీజేపీ ప్రభుత్వ పనితీరుపై దేశవ్యాప్తంగా రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఏడాదిన్నర పాటు రైతులు ఢిల్లీ శివారులో రైతుల ఉద్యమంతో మోదీ ప్రభుత్వానికి చావు తప్పి కన్ను లొట్టబోయిన్నట్టయింది. ఆ ప్రభావం గుజరాత్‌లోనూ ఉన్నది. పైగా కరెంటు కష్టాలు అంతకంతకూ పెరిగిపోతుండటం ఆ రాష్ట్ర రైతుల్లో బీజేపీపై ఆగ్రహం పెరిగేలా చేసింది.