కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘గెలిచిన ఆరు నెలల్లో మీ ఊరికి బస్సు వేయిస్తానన్న హామీ ఏమైంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ సామాన్యుడిపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించిన అమానుష ఘటన ఇది. 16 గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పోలీసులు చితకబాది నిర్బంధించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన బండారి శ్రీనివాస్‌ను జగిత్యాల జిల్లా మల్యాల పోలీసులు దారుణంగా కొట్టగా, ఆ అవమానాన్ని భరించలేక ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడి ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బండారి శ్రీనివాస్ ఈ నెల 12న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ప్రశ్నిస్తూ ‘మా ఊరికి వేయిస్తానన్న బస్సు ఏది ఎమ్మెల్యే గారూ’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై మల్యాల మండలం నాచుపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త చెవులమద్ది శ్రీనివాస్.. బండారి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో ఫోన్లోనే ఇద్దరూ తిట్టుకున్నారు. తాను దళితున్నని, బండారి శ్రీనివాస్ తనను కులం పేరుతో దూషించాడని అదేరోజు మల్యాల పోలీస్‌స్టేషన్‌లో బండారి శ్రీనివాస్‌పై చెవులమద్ది శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. ఈ నెల 13న హిమ్మత్‌నగర్‌లో ఉన్న బండారి శ్రీనివాస్ ఇంటికి వచ్చిన మల్యాల పోలీసులు, స్టేషన్‌కు రమ్మని చెప్పడంతో వెళ్లాడు. అక్కడ ఎస్ఐ నరేశ్‌కుమార్ తనను తీవ్రంగా కొట్టడమే కాకుండా ఇష్టమున్నట్టు పిడిగుద్దులు గుద్దినట్టు బాధితుడు శ్రీనివాస్ తెలిపాడు. 12 గంటలపాటు సెల్లో నిర్బంధించినట్టు వాపోయాడు. తనపై ఫిర్యాదు చేసిన చెవులమద్ది శ్రీనివాస్ కూడా ఎస్ఐ ముందే తిట్టాడని బండారి శ్రీనివాస్ వాపోయాడు. రాత్రి 10.30 గంటల తర్వాత తన ఇంటికి ప్రైవేట్ వాహనంలో తీసుకొచ్చి వదిలి వెళ్లారని చెప్పారు.
ఎస్ఐ కొట్టాడని అవమానంతో..
ఎస్ఐ కొట్టిన దెబ్బలకు అవమాననంగా భావించి, కరీంనగర్ వన్‌టౌన్ ఏరియాలోని ఓ హోటల్ వద్ద ఎలుకల మందు తాగుతూ బాధితుడు బండారు శ్రీనివాస్ సెల్పీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు మల్యాల ఎస్ఐ నరేశ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, శ్రీనివాస్ కారణమని రికార్డు చేశాడు. స్థానిక పోలీసులు ఆయనను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. తనను మల్యాల ఎస్ఐ నరేశ్‌కుమార్ కులం పేరు అడిగి మరీ తిట్టాడని, నీ కులంలో ఇలాంటి వారు పుట్టరురా? అని దుర్భాషలాడారని వాపోయాడు. మరోసారి ఇలాంటి పోస్టులు పెడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తానని ఎస్ఐ బెదిరించారని శ్రీనివాస్ తెలిపాడు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. కాగా, తాను శ్రీనివాస్‌కు కేవలం కౌన్సెలింగ్ చేశానని, ఆయనను కొట్టలేదని మల్యాల ఎస్ఐ నరేశ్‌కుమార్‌ను వివరణ ఇచ్చారు. చెవులమద్ది శ్రీనివాస్‌ను కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదు రావడంతో బండారి శ్రీనివాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.