యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఘోర అవమానం జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పోలీసులు వేర్వేరుగా అడ్డుకున్నారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నీటిపారుదల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెలికాప్టర్లో భువనగిరికి చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హెలిపాడ్ వద్దకు వేర్వేరుగా వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ పాయింట్ వద్ద గుర్తించని పోలీసు అధికారులు వారిని అడ్డుకున్నారు.
చెయ్యి, భుజం పట్టుకొని పక్కకు నెట్టారు. దాంతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుండగా అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బుజ్జగించి వెనక్కి రప్పించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన వినిపించుకోలేదు. ‘పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా? ఎవరు ఎమ్మెల్యే, ఎవరు కాదు అనేది తెల్వదా?’ అంటూ వీరేశం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్వాగతం పలికేందుకు రావాలని పలువురు ఆయనకు ఫోన్ చేసినా రాకుండా వేదికపైనే ఉండిపోయారు. ఇదే సమయంలో ఏసీపీతో తీన్మాన్ మల్లన్న పంచాయితీ పెట్టుకున్నారు. మా జిల్లాలో పనిచేస్తూ మమ్మల్ని గుర్తుపట్టరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముఖాలు చూడుర్రి.. బట్టలు చూడకుర్రి’ అంటూ ఎంపీ చామల అసంతృప్తిని వ్యక్తం చేశారు.