హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ పోలీసులకు వివిధ సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. పోలీసుశాఖలోని అన్ని విభాగాల్లో శౌర్య పతకం నుంచి సేవా పతకం వరకు మొత్తం 629 మందికి ఈ సేవా పతకాలను ప్రకటించారు. అగ్నిమాపశాఖలో 18 మందిని ఎంపిక చేశారు. ఈ పతకాలను ఆగస్టు 15న ఇవ్వనున్నట్టు సమాచారం. పోలీసుశాఖలో శౌర్యపతకానికి ఏడుగురిని, మహోన్నత సేవా పతకానికి 15, ఉత్తమ సేవా పతకానికి 93, కఠిన సేవా పతకానికి 54, సేవా పతకానికి 460 మందిని ఎంపిక చేశారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.