హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): మీ స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగతనం చేశారా? ఆ ఫోన్ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఉండొచ్చు. లేదా ఆఫ్రికాలోని మరేతర దేశంలోనైనా ఉండొచ్చు. అవును! ఇక్కడ దొంగతనం చేసిన ఫోన్లన్నీ దేశాలు దాటిపోతున్నాయని సైబరాబాద్ పోలీసులు తేల్చారు. దానికోసం ప్రత్యేకంగా ఒక బడా మాఫియానే ఉందని గుర్తించారు. సెల్ఫోన్ దొంగతనాలపై నజర్ పెట్టిన మేడ్చల్ పోలీసులకు ఒక దొంగల బ్యాచ్ పట్టుబడింది. ఈ ముఠాలో ఒడిశా, ఏపీకి చెందినవారితో పాటు ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ముఠా నుంచి దాదాపు 100 సెల్ఫోన్లు దొరకటంతో లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
సెల్ఫోన్ దొంగలు మనుపాటి బాలకృష్ణ, మురళి, అంబటి, జగన్నాథం, బాలరాజు, ముగ్గురు మైనర్లు సెల్ఫోన్లు దొంగతనం చేసి, హైదరాబాద్లోని జగదీశ్ మార్కెట్లో విక్రయిస్తారు. ఈ ఫోన్లు కొనేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఉంటారు. ఒక్కో ఫోన్ అమ్మితే వాళ్లు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల నగదు ఇస్తారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా, మిగతా సెల్ఫోన్ వ్యాపారులు పోలీసులనే చుట్టుముట్టారు. ఇక్కడ ఎలాంటి దొంగ ఫోన్లు లేవని దబాయించారు. పోలీసులు ఆధారాలతో సహా చూపించి ఫోన్లను రికవరీ చేశారు. అయితే, దొంగతనం చేసిన ఫోన్లను కొనటం వెనుక ఉన్న అంశాలపై దృష్టి పెట్టగా.. మరో కోణం బయటికి వచ్చింది. దొంగతనం చేసిన ఫోన్లనన్నీ కంటైనర్లలో లోడ్ చేసి పెద్ద పెద్ద ఓడల్లో దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నారని తెలిసింది. అక్కడ ఐఎంఈఐ నంబర్ మార్చి, అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ మాఫియాను ఛేదించాలంటే దేశవ్యాప్త పోలీస్ నెట్వర్క్తో సమన్వయం ఉండాలని పోలీసులు చెప్తున్నారు.