Crime News | సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు, దళిత నాయకుడు జువ్వన్న కనకరాజు ఇంట్లో డబ్బులు నిల్వ చేశారని ఫిర్యాదు రావడంతో ఆయన ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. అంతకు ముందు కనకరాజు అనారోగ్యంతో ఉన్న తన భార్యకు వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా దవాఖానకు వెళ్లారు. ఈ విషయమై పోలీసులు సంప్రదించినప్పుడు ప్రస్తుతం తన భార్య అనారోగ్యంతో ఉండటంతో హైదరాబాద్ వచ్చానని, పోలీసు అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. కానీ ఇంట్లో ఎవరూ లేని వేళ కనకరాజు ఇంటిని సీజ్ చేసిన పోలీసులు.. పహారా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన కనకరాజు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంటి తాళాలు తీయాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. అనారోగ్యంతో ఉన్న కనకరాజు భార్యను, ఇతర కుటుంబ సభ్యులను ఇంటి బయటే రెండు గంటల పాటు నిలబెట్టి కాలయాపన చేశారు. `నా ఇంటి తాళం తీయండి. అధికారులకు పూర్తిగా సహకరిస్తాను` అని కనకరాజు వేడుకున్నా పోలీసులు కనికరించకుండా దాదాపు రెండు గంటలు ఆలస్యం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఇబ్బందులకు గురి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు భారీగా కనకరాజు ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు పోలీసులు కనకరాజు ఇంటి తాళాలు తొలగించి, లోపల పూర్తిగా తనిఖీ చేశారు. ఇంట్లో దేవుని గల్లాలో వేసిన చిల్లర నాణాలు రూ.276 మాత్రమే లభించాయి. దీంతో పోలీసులు వెనుతిరిగి వెళ్లారు.