హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘నీ మీద రేప్ జరిగిందా..? ఎలా జరిగింది..?’ ఇదీ మల్కాజిగిరి జోన్ పరిధిలోని ఓ స్టేషన్లో ఎస్సై అడిగిన ప్రశ్నలు. అక్కడ మహిళా సిబ్బంది లేకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులు, వారి తరపున అక్కడికి వచ్చిన పదిమంది సమక్షంలో ఎస్ఐ నిర్వహించిన దర్బార్.. డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకుండా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకే వత్తాసు పలికి.. సదరు యువతిని బెదిరించి నోరు మూయించినట్టుగా తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 16న ఎల్బీనగర్ జోన్లోని ఓ ఠాణాకు వెళ్లిన మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఫిర్యాదు తీసుకోవాలని కోరింది. 12వ తేదీన ఈవెంట్ ఉందంటూ ఇద్దరు వ్యక్తులు.. తనను కారులో ఎక్కించుకొని శివారు ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపింది.
అక్కడికి వెళ్లిన తర్వాత కొట్టి.. బెదిరించి.. అఘాయిత్యానికి పాల్పడినట్టు పేర్కొంది. ఆ యువతి చెప్పిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండానే వెనక్కి పంపించారని తెలిసింది. ఆ తర్వాత బాధితురాలు ఓ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతో స్టేషన్లోని అధికారులపై మండిపడ్డట్టు సమాచారం. మహిళ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు.. తిప్పి పంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. సదరు యువతి చెప్పిన వివరాల ఆధారంగా విషయాలు సేకరించి, నిందితులను పట్టుకోవాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. సదరు ఠాణా అధికారులు దర్యాప్తు ప్రారంభించి, నిందితులు మీర్పేట్లో ఉన్నారని గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారు వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులను, ఫిర్యాదుదారును మల్కాజిగిరి జోన్లోని ఆ ఠాణాకు అప్పగించారు.
సివిల్ వివాదంగా మార్చి… సెటిల్మెంట్!
యువతి ఫిర్యాదులో పేర్కొన్న ప్రాంతం.. మల్కాజిగిరి జోన్ పరిధిలోని ఠాణాకు వస్తుండటంతో ఆ యువతి, తన సోదరితో కలిసి అక్కడకు వెళ్లింది. అప్పటికే ఆ ఠాణాకు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులు, వారి తరపున కొంతమంది పెద్ద మనుషులు వచ్చి కూర్చున్నారు. కేసు విచారణ బాధ్యతను చేపట్టిన ఒక ఎస్సై.. ఠాణాలో దర్బార్ నిర్వహించారని తెలిసింది. ఆ ఎస్సై ఫిర్యాదు చేసిన మహిళను పిలిపించి, అప్పటికే ఆ ఎస్సై చుట్టూ సెటిల్మెంట్ కోసం వచ్చిన సుమారు పది మంది కూర్చున్నారు. కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ లేరు. బాధితురాలి సోదరిని కూడా అక్కడికి రానీయలేదు. లైంగిక దాడి జరిగిందా..! ఎలా జరిగిందంటూ ఆమెను ఎస్సై ప్రశ్నించినట్టు తెలిసింది. నాలుగైదు గంటలపాటు ఎస్సై దబాయిస్తూ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడినట్టు సమాచారం. ‘కేసు పెట్టుకొని పెద్దగా చేయడం ఎందుకు… వాళ్లు ఎంతో కొంత ఇస్తారు.. తీసుకొని నోరు ముసుకొనిపో. లేకపోతే నువ్వే ఇబ్బంది పడుతావు’ అంటూ బెదిరింపులకు దిగారని తెలిసింది. స్టేషన్లోనే పెద్దమనుషుల నడుమ పంచాయితీ నిర్వహించి, ఎస్సై సెటిల్మెంట్ చేసినట్టు సమాచారం
లైంగిక దాడి… డబ్బుల పంచాయితీ!
లైంగిక దాడి కేసు అంటే ఉన్నతాధికారులు సీరియస్ అవుతారనే ఉద్దేశంతో ఈ ఘటనను క్షేత్ర స్థాయిలోని అధికారులు డబ్బుల పంచాయితీకి సంబంధించిందిగా మార్చేశారని తెలిసింది. ఎల్బీనగర్ జోన్లోని పోలీసులను అడిగితే ‘ఓ మహిళ.. మా వద్దకు వచ్చి, ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. మేం ఇద్దరు నిందితులను పట్టుకుని సంబంధిత పీఎస్కు అప్పగించాం’ అని తెలిపారు. మల్కాజిగిరి జోన్లోని సదరు ఠాణా అధికారులను అడిగితే ‘ మొన్న ఒక పైసల పంచాయితీ వచ్చినట్టుంది.. బాధితురాలు ఫిర్యాదు ఇవ్వలేదు… ఒక వేళ రేప్ కేస్ అయితే కేసు చేసే వాళ్లం’ అన్నారు. మరోవైపు లైంగిక దాడి కేసులో కూడా కేసు నమోదు చేయకపోవడమేంటని, పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.