వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 17: నూతన యంత్రాన్ని ప్రారంభించడానికి ఇద్దరు మంత్రులు ఎంజీఎం దవాఖానకు రావడంతో ఓపీ విభాగంలో రోగులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మంగళవారం ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ) యంత్రాన్ని ప్రారంభించడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండాసురేఖ దవాఖానకు చేరుకున్నారు. మంత్రులకు రోగులు ఎదురుపడకుండా ఉండాలని భావించిన పోలీసులు… వారిని ఓపీ విభాగానికి ఉన్న నాలుగు ద్వారాల్లో మూడింటికి తాళాలు వేశారు. ఓపీ సేవల కోసం వచ్చి పరీక్షలు నిర్వహించుకున్న రోగులు తిరిగి బయటకు వెళ్లడానికి వీలు లేకుండా అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. దీనికితోడు ఓపీ విభాగంలో మందులు అందించే నాలుగు కౌంటర్లను సైతం మూసివేసి ఓపీ విభాగంలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేయడంతో మందులు తీసుకోవడానికి, తిరిగి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు, నడవలేని వారు చేసేదేమీ లేక అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలావుండగా తాళాలు వేయడంతో గేటు లోపలే ఉన్న రోగులకు మంత్రులు అభివాదం చేసుకుంటూ వెళ్లడం కొసమెరుపు.