హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పోలీసు శాఖలో త్వరలో 18,334 పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకొనేందుకు యువత కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నది. కోచింగ్ ఖర్చుతో కూడిన వ్యవహారం. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా యువతకు శిక్షణ ఇవ్వాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని పోలీసు కమిషనరేట్ల సీపీలు, ఎస్పీలను ఆదేశించడంతో ఉచిత కోచింగ్ శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. పోలీసు ఉద్యోగం సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలి? శారీరక దారుఢ్యం ఎలా పెంచుకోవాలి? అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టలేని పేద విద్యార్థులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ శిబిరాలు వరంగా మారుతున్నాయి. మండల, జిల్లా కేంద్రాలతోపాటు చిన్న పట్టణాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండటంతో గ్రామీణ యువతకు సైతం అందుబాటులో ఉంటున్నాయి.
పోలీసుశాఖ ఆధ్వర్యంలోని కోచింగ్ శిబిరాలను ప్రైవేట్ సెంటర్లకు దీటుగా నిర్వహిస్తున్నారు. ఫంక్షన్‌హాళ్లను అద్దెకు తీసుకొని, నిపుణులైన ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తున్నారు. స్థానికత, ఇతర అన్ని ధ్రువపత్రాలు, అర్హతలను పరిగణనలోకి తీసుకొని అడ్మిషన్ ఇస్తున్నారు. అభ్యర్థులకు ఐడీ కార్డులు, మెటీరియల్ అందిస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇతర పోలీసు కమిషనరేట్లు, జిల్లాల్లోనూ వచ్చే వారం రోజుల్లో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ శిబిరాలు ప్రారంభించనున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమవంతుగా సహకారం అందిస్తున్నారు.
యువతకు ఇది గొప్ప అవకాశం
పోలీసుశాఖలో 18,334 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రక టించింది. పోలీసు శాఖలో చేరి సమాజానికి సేవ చేయడానికి తెలంగాణ యువతకు ఇది గొప్ప అవకాశం. యువతలోని నైపుణ్యాలను పెంచేలా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం.
-ట్విట్టర్లో డీజీపీ మహేందర్‌రెడ్డి
నాన్న కోసం పోలీసు అవుతా
మా నాన్నకు నేను పోలీసు కావడం ఇష్టం. నాకు కూడా డిపార్ట్మెంట్లో చేరాలని కోరిక. మా పెద్దనాన్న కూతురు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. పోలీసులు మా ఊరి సమీపంలోనే ఉచితంగా కోచింగ్ ఇవ్వడం సంతోషకరం.
– సంకీర్తన, శంషాబాద్
ఎస్సై కావాలని బ్యాంకు ఉద్యోగం వదిలేశా
పోలీస్ ఉద్యోగం నా కల. హెచ్‌డీఎఫ్‌సీలో ఉద్యోగం వచ్చినా వదిలేశా. ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. పోలీసుశాఖ ఆధ్వర్యంలోని ఉచిత కోచింగ్‌కు హాజరవుతున్న. నోట్స్ కూడా ఇస్తున్నారు. బాగా ప్రిపేర్ చేయిస్తున్నారు.
– కుమెయిన్ అలీ, ఎస్సై ఉద్యోగార్థి
పోలీసు బాబాయి స్ఫూర్తి
మాది శంషాబాద్. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న. మా బాబాయి సీఐ. నాకు కూడా యూనిఫాం సర్వీస్‌లోకి రావాలని ఉన్నది. మా నాన్న సెంట్రింగ్ వృత్తి. ఉచిత శిక్షణ పేదలకు గొప్ప అవకాశం.
– సుచిత్ర, కానిస్టేబుల్ ఉద్యోగార్థి
కోచింగ్ బాగుంది
కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా. చాలా మంచి ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తున్నారు. బయట రూ. నలభైయాభై వేలు పెట్టినా ఇంత మంచి కోచింగ్ దొరకదు. మా నాన్న ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆర్ఎస్సై. నాన్న నాకు స్పూర్తి.
– రోహిత్, శంషాబాద్
పోలీసు ఉద్యోగం సాధిస్తా
పీజీ పొలిటికల్ సైన్స్ చదువుతున్నా. పోలీసు ఉద్యోగం చాలా ఇష్టం. మా నాన్న రైతు. మాలాంటి పేద అభ్యర్థులకు ఉచిత కోచింగ్ గొప్ప వరం. కోచింగ్ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
– ఝాన్సీరాణి, శంషాబాద్