హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ నాయకత్వంలో వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన మాజీ సర్పంచులు శాసనసభవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
తమ న్యాయమైన సమస్యలను పరిషరించాలని, అసెంబ్లీ వేదికగా మాజీ సర్పంచుల గోడు వినిపించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. జేఏసీ నాయకులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు సుర్వి యాదయ్యగౌడ్తోపాటు జేఏసీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పోలీసు బలగాలతో తమ ఉద్యమాలను ఆపలేదని, మాజీ సర్పంచులకు రావలసిన నయాపైసా సహా మొత్తం బకాయిలు ప్రభుత్వం చెల్లించేవరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. 33 నెలలుగా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాలామంది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యపై సమగ్రంగా చర్చించి, తక్షణమే నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.